VV Lakshminarayana: ‘రాజద్రోహం’ కేసులపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- రాజులే లేనప్పుడు రాజద్రోహం అభియోగాలేంటి?
- పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి
- పన్నులకు వ్యతిరేకంగా ప్రజలు మూకుమ్మడిగా ఉద్యమిస్తే పాలకులు తోకముడుస్తారు
- చీరాల, పేరాల ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాలి
గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా ‘రాజద్రోహం’ కేసులు పెడుతుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. బ్రిటిషర్ల కాలం నాటి రాజద్రోహం కేసులు మోపడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజద్రోహం కేసులుపై తాజాగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. నెల్లూరు జిల్లా కావలిలో జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్ సంస్థ నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఆర్థిక వనరులను సృష్టించడం ప్రభుత్వాల బాధ్యత అని, దానిని మానేసి ప్రజలపై పన్నుల భారం మోపడం తగదని అన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోలు లీటరు రూ. 65, డీజిల్ రూ. 45కే లభిస్తుందని అన్నారు. ఇటీవల ఎడాపెడా నమోదవుతున్న రాజద్రోహం కేసులో లక్ష్మీనారాయణ స్పందిస్తూ .. రాజులే లేనప్పుడు రాజద్రోహ అభియోగాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. మితిమీరిన పన్నులకు వ్యతిరేకంగా ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తే పాలకులు తోకముడవక తప్పదన్నారు. బ్రిటిషర్ల హయాంలో జరిగిన చీరాల, పేరాల ఉద్యమమే ఇందుకు ఉదాహరణ అని గుర్తు చేశారు. రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటించాలని సూచించారు. అనంతరం రక్తదానం చేసిన ఆయన కరోనా నాటుముందు తయారీదారు ఆనందయ్యను సత్కరించారు.