Hyderabad: హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
- హుసేన్ సాగర్‌లో అమ్మవారి విగ్రహాల నిమజ్జనం
- ఉదయం నుంచి భారీగా విగ్రహాలు
- చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమం
- మధ్యాహ్నం 3 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నవరాత్రుల ఉత్సవాలు ముగియడంతో నగరంలోని హుసేన్ సాగర్‌లో అమ్మవారి విగ్రహాల నిమజ్జనం జరుగుతోన్న నేపథ్యంలో ఆ ప్రాంతం వైపుగా వెళ్లే రహదారులపై ఆంక్షలు విధించారు. ఈ రోజు ఉదయం నుంచి హుసేన్ సాగర్ వైపునకు పెద్ద సంఖ్యలో విగ్రహాలు వస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
మరోవైపు, ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే-ఫండే కార్యక్రమం కొనసాగుతున్న మాదిరిగానే నేటి నుంచి ఇటువంటి కార్యక్రమాన్నే చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరుతో నిర్వహిస్తున్నారు. దీంతో నేటి సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్యాంక్‌బండ్ తరహాలోనే చార్మినార్ వద్ద నో ట్రాఫిక్ జోన్ ఉండనుంది.
ఆ ప్రాంతానికి సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు చార్మినార్ పరిసరాల్లోకి వాహనాలను అనుమతించబోమని పోలీసులు ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అఫ్జల్‌గంజ్, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ నుంచి మేతీ కా షేర్, కాలీకమాన్, ఏతిబజార్ వైపునకు మళ్లిస్తారు.
అలాగే, ఫలక్‌నుమా, హిమ్మత్‌పురా వైపు నుంచి వచ్చే వాహనాలను పంచ్‌మొహల్లా నుంచి షా ఫంక్షన్ హాల్, మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ రోడ్, బీబీ బజార్ వైపునకు మళ్లించనున్నారు. బీబీ బజార్, మొఘల్‌పురా వాటర్ ట్యాంక్, హఫీజ్ ధన్కా మాస్క్ వైపు నుంచి వచ్చే వాహనాలను సర్దార్ మహల్ నుంచి కోట్ల అలీజా, ఏతీ బజార్ చౌక్ వైపునకు మళ్లిస్తారు.