Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ
- టీ20 వరల్డ్ కప్ తర్వాత గుడ్ బై చెప్పనున్న రవిశాస్త్రి
- కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ
- బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ పదవులకూ దరఖాస్తులు
- హెడ్ కోచ్ గా ద్రావిడ్ అంటూ మీడియాలో కథనాలు!
టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ అనంతరం కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్ బై చెబుతున్నారు. కోచ్ గా కొనసాగేందుకు శాస్త్రి ఆసక్తి చూపకపోవడంతో బీసీసీఐ కొత్త కోచ్ అన్వేషణకు తెరలేపింది. టీమిండియా హెడ్ కోచ్ పదవితో పాటు ఇతర సహాయక సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
హెడ్ కోచ్ పదవికి సరిపడా అర్హతలు ఉన్నవారు తమ దరఖాస్తులను అక్టోబరు 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని పేర్కొంది. బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ పోస్టులకు నవంబరు 3 లోగా దరఖాస్తులు సమర్పించాలని వివరించింది. వీటితోపాటు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో స్పోర్ట్ సైన్స్/స్పోర్ట్స్ మెడిసిన్ విభాగం అధిపతిగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కోరింది.
కాగా, టీమిండియా తదుపరి కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కు అవకాశం ఇవ్వనున్నారంటూ నిన్నటి వరకు కథనాలు వచ్చాయి. దీనిపై అటు బోర్డు కానీ, ఇటు ద్రావిడ్ కానీ ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో, బీసీసీఐ తాజా ప్రకటన పట్ల ద్రావిడ్ స్పందించి దరఖాస్తు చేసుకుంటాడా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.