Prakasam District: వైద్యం పేరుతో మహిళపై భూతవైద్యుడి అత్యాచారయత్నం.. ప్రతిఘటించడంతో హత్య.. పోలీసుల సమక్షంలోనే చంపేసిన గ్రామస్థులు

Villagers in Prakasam dist killed a blackmagicker in the presence of police

  • మందులు ఇస్తానంటూ మహిళను ఇంటికి పిలిచిన భూతవైద్యుడు
  • మద్యం మత్తులో అత్యాచార యత్నం
  • ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో ఘటన
  • గ్రామస్థులను నిలువరించలేకపోయిన పోలీసులు
  • అదనపు బలగాలు వచ్చే లోపే నిందితుడి హతం

చికిత్స కోసం తన వద్దకు వచ్చిన మహిళపై ఓ భూతవైద్యుడు అత్యాచారం చేయబోయాడు. ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గొంతు కోసి చంపేశాడు. విషయం తెలిసి ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్థులు పోలీసులు సమక్షంలోనే అతడిని దారుణంగా కొట్టి చంపారు.

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో నిన్న జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ నాటువైద్యుడు, భూత వైద్యుడిగా చెప్పుకునే తన్నీరు ఓబిశెట్టి (60) అలియాస్ ఓబయ్య వద్ద గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటోంది.

మందులు ఇస్తానంటూ నిన్న సాయంత్రం ఆమెను ఇంటికి పిలిచిన నాటు వైద్యుడు మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె అతడిని ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు ఓబిశెట్టి పదునైన కత్తితో ఆమె గొంతుకోశాడు. ఆ సమయంలో ఆమె పెద్దగా కేకలు వేసినప్పటికీ అతడు వైద్యం చేస్తున్నాడన్న ఉద్దేశంతో ఇరుగుపొరుగువారు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వచ్చి కంగారుగా తిరుగుతున్న ఓబయ్యను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న స్థానికులు, బాధిత మహిళ కుటుంబ సభ్యులు, భర్త, కుమారులు పోలీసుల అదుపులో ఉన్న ఓబయ్యపై దాడికి పాల్పడ్డారు. గ్రామస్థులు ఒక్కసారిగా దాడిచేయడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు.

దీంతో అదనపు బలగాల కోసం ఫోన్ చేశారు. అయితే, అవి వచ్చేలోపే ఓబయ్యను గ్రామస్థులు కర్రలతో కొట్టి చంపేశారు. ఇది చూసిన ఎస్ఐ రజియా సుల్తానా కళ్లుతిరిగి పడిపోయారు. సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్ అదనపు బలగాలతో గ్రామానికి చేరుకునే సరికే ఓబయ్య హతమయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News