Bangladesh: టీ20 ప్రపంచ కప్: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్
- 141 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన బంగ్లాదేశ్
- ఆల్‌రౌండర్ నైపుణ్యంతో మనసులు దోచుకున్న స్కాట్లాండ్
- బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన క్రిస్ గ్రీవ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
టీ20 ప్రపంచకప్ ప్రారంభంలోనే అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రపంచ క్రికెట్‌లోని మేటి జట్లను మట్టికరిపించిన బంగ్లాదేశ్‌ను ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న స్కాట్లాండ్ వెన్నువిరిచింది. గతరాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రిస్ గ్రీవ్స్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా ఓపెనర్ మున్సీ 29, మార్క్ వాట్ 22 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మహేది హసన్ 3, ముస్తాఫిజుర్, షకీబ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అహ్మద్, సైఫుద్దీన్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 141 పరుగుల ఓ మాదిరి విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. షకీబల్ హసన్ 20, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 38, కెప్టెన్ మహ్మదుల్లా 23, అఫీఫ్ హొసైన్ 18 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్లీ వీల్ 3 వికెట్లు పడగొట్టగా, క్రిస్ గ్రీవ్స్ రెండు, జోష్ డేవీ, మార్క్ వాట్ చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్, బౌలింగులో సత్తా చాటిన క్రిస్ గ్రీవ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీ20 ప్రపంచకప్‌లో నేడు ఐర్లాండ్-నెదర్లాండ్స్, శ్రీలంక-నమీబియా మధ్య గ్రూప్-ఎ మ్యాచ్‌లు జరుగుతాయి.