Nalgonda District: గంజాయి స్మగ్లర్లను తరలిస్తున్న పోలీసులపై రాళ్లదాడి.. కాల్పులు జరిపిన పోలీసులు: విశాఖ మన్యంలో ఘటన

Villagers Pelted stones on police vehicle police responds with firing

  • అన్నవరంలోని గాలిపాడులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నిందితులను నర్సీపట్నం తీసుకెళ్తుండగా వాహనాన్ని వెంబడించిన గ్రామస్థులు
  • పోలీసు వాహనం ఆగడంతో చుట్టుముట్టేసి దాడికి దిగిన గ్రామస్థులు
  • ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామన్న నల్గొండ ఎస్పీ

గంజాయి స్మగ్లర్లను తరలిస్తున్న పోలీసుల వాహనాన్ని వెంబడించిన కొందరు రాళ్లదాడికి పాల్పడగా, పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఇద్దరు గిరిజనులు గాయపడ్డారు. విశాఖ మన్యంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీను అనే వ్యక్తి ఇటీవల నల్గొండ జిల్లాలో గంజాయితో పట్టుబడ్డాడు.

అతడు ఇచ్చిన సమాచారంతో ఈ కేసులోని ఇతర నిందితులను గుర్తించేందుకు ఈ నెల 15న నల్గొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శ్రీనుతో కలిసి చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీలోని గాలిపాడుకు వెళ్లారు. శనివారం మరోమారు గ్రామానికి వచ్చిన పోలీసులు బాలకృష్ణ, లోవరాజులను అరెస్ట్ చేసి నర్సీపట్నం తీసుకెళ్లారు. నిన్న మరోమారు గ్రామానికి వచ్చిన పోలీసులు కిల్లో భీమరాజు అనే గిరిజనుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులు నలుగురిని వాహనంలో ఎక్కించుకుని నర్సీపట్నం బయలుదేరారు.

ఈ క్రమంలో భీమరాజుకు గంజాయితో సంబంధం లేదని పోలీసులకు చెప్పి విడిపించుకునేందుకు అన్నవరం సర్పంచ్ పాంగి సన్యాసిరావు, ఎంపీటీసీ సభ్యుడు కిల్లో వరహాలబాబు, మరో ఎనిమిదిమంది కలిసి జీపులో పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ బయలుదేరారు. తురబాల గెడ్డ సమీపంలో పోలీసు వాహనాన్ని చుట్టుముట్టిన గ్రామస్థులు రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి.

దీంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. తండ్రీ కుమారులైన కిల్లో కామరాజు (55), కిల్లో రాంబాబు (25) కాళ్లలోకి తూటాలు దూసుకెళ్లడంతో వారిని వెంటనే నర్సీంపట్నం ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చింతపల్లి సీఐ, అన్నవరం ఎస్సై వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. 30 మంది స్మగ్లర్లు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడడంతోనే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టు నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు.

  • Loading...

More Telugu News