Asaduddin Owaisi: భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌పై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ!
- టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈ నెల 24న మ్యాచ్
- ఓ వైపు కశ్మీర్లో ఉగ్రదాడుల్లో జవాన్ల మృతి
- మరోవైపు మ్యాచ్ ఆడతారా?
- కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో విఫలం
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత నేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల్లో తొమ్మిది మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.
ఓ వైపు పాక్ ప్రోత్సాహంతో చెలరేగిపోతోన్న ఉగ్రవాదం వల్ల మన సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడుతుందని ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కేంద్ర సర్కారు విఫలమైందని అన్నారు.
చైనాను ఎదుర్కోవడంలోనూ మోదీ సర్కారు సమర్థంగా పనిచేయట్లేదని చెప్పారు. రెండు అంశాలపై ప్రధాని మోదీ స్పందించడం లేదని ఆయన చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకి రూ.100 దాటినా స్పందించడం లేదని, అలాగే, సరిహద్దుల్లో చైనా కూడా మన భూభాగంలోకి ప్రవేశిస్తోందని దీనిపై కూడా మోదీ స్పందించడం లేదని ఆయన విమర్శించారు. మన భూభాగాల్లోకి చైనా సైనికులు దూసుకువస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని ఆరోపించారు.