Bonda Uma: తెలంగాణ పోలీసులు వచ్చింది గంజాయి స్మగ్లర్ల కోసం కాదా?: బోండా ఉమ
- గంజాయి గురించి మాట్లాడితే నక్కా ఆనందబాబుకు నోటీసులు ఇస్తారా?
- రాష్ట్రమంతా వైసీపీ నేతలు గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు
- ఏపీలో 9 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతోందని కేంద్ర నిఘా వర్గాలు చెపుతున్నాయి
గంజాయి అంశం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. గంజాయి స్మగ్లింగ్ గురించి మాట్లాడిన టీడీపీ నేత నక్కా ఆనందబాబుకు నిన్న అర్ధరాత్రి పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బోండా ఉమ మాట్లాడుతూ... గంజాయిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తే నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు.
కేవలం వైజాగ్ లోనే కాకుండా... రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గంజాయి వ్యాపారం చేస్తున్న వైసీపీ నేతలను వదిలేసి... వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్న టీడీపీ నేతలను వేధిస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో దాదాపు 9 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతోందని కేంద్ర నిఘా వర్గాలు చెపుతున్నాయని బోండా ఉమ అన్నారు. ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని విమర్శించారు. తెలంగాణ పోలీసులు విశాఖ ఏజెన్సీలోకి వచ్చి గంజాయి స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నం చేశారని... వారిపై స్మగ్లర్లు దాడికి పాల్పడితే పోలీసులు కాల్పులు జరిపారని చెప్పారు. తెలంగాణ పోలీసులు వచ్చింది గంజాయి స్మగ్లర్ల కోసమా? కాదా? అని ప్రశ్నించారు.