TJR Sudhakar Babu: సీఎం జగన్ ను నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం: టీజేఆర్ సుధాకర్ బాబు వార్నింగ్
- ఏపీలో హింసా రాజకీయాలు
- సీఎం జగన్ పై పట్టాభి వ్యాఖ్యలు
- భగ్గుమన్న వైసీపీ శ్రేణులు
- నోరు అదుపులో పెట్టుకోవాలన్న వైసీపీ అధికార ప్రతినిధి
- పందులను, కుక్కలను వదిలారంటూ విమర్శలు
ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబుకు నర్సీపట్నం పోలీసులు నోటీసులు పంపగా, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సీఎం జగన్ పై ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలతో భగ్గుమన్న వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు స్పందించారు.
సీఎం జగన్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. కొడుకు ప్రయోజకుడు కాలేదన్న అసహనంతో ఉన్న చంద్రబాబు... రాష్ట్రంపైకి పందులను, కుక్కలను వదిలాడని విమర్శించారు. టీడీపీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజాసమస్యలపైనా, ప్రభుత్వ పరమైన, విధానపరమైన అంశాలపైనా మాట్లాడితే తమకు ఎలాంటి అభ్యంతరంలేదని సుధాకర్ బాబు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో టీడీపీ అందుకు భిన్నంగా బురదలో పొర్లే పందులతోనూ, నోటికి పనిచెప్పే కుక్కలు, నక్కలతోనూ మీడియా సమావేశాలు నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమిని చంద్రబాబు భరించలేకపోతున్నాడన్నదానికి ఇలాంటి ప్రెస్ మీట్లే నిదర్శనమని అన్నారు.
ప్రపంచంలో ఉన్న ఏ తిట్టుకు వీరు సరిపోలరని సుధాకర్ బాబు అభిప్రాయపడ్డారు. మీరు ఎంత తిట్టినా సీఎం జగన్ స్థాయిని ఒక్క అంగుళం కూడా తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. నక్కా ఆనంద్ బాబు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ తదితరులు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి సీఎంను మాట్లాడిన మాటలకు వారే సిగ్గుపడాలని అన్నారు. బూతులు తిడితేనే బాగా ఉంటుందని నేర్పించిన నాయకుడి నాయకత్వంలో ఒక్కొక్కరు తెగబలిసిపోయారని విమర్శించారు.
నాలుకను ఇష్టం వచ్చినట్టు వాడే ముందు చంద్రబాబు ముఠా జాగ్రత్తగా ఉంటే మంచిదని, స్పృహలో ఉండి మాట్లాడాలని హెచ్చరించారు. 'సీఎంపై మీ మాటలు మా గుండెల్లో గుచ్చుకుంటున్నా, ఎంతో సహనం వహిస్తున్నాం. సంస్కారవంతుడైన నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మీరు బతికిపోయారు' అంటూ వ్యాఖ్యానించారు.