Chandrababu: నా టెంపర్ మెంట్ లూజ్ చేసుకోవడానికి ఒక్క సెకను చాలు: చంద్రబాబు
- రాష్ట్రంలో టీడీపీ నేతలపై దాడులు
- వైసీపీపై చంద్రబాబు ఆగ్రహావేశాలు
- తనను దెబ్బతీయడం వైసీపీ నేతల వల్ల కాదని వ్యాఖ్యలు
- ఈ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపు
రాష్ట్రంలో టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా సమావేశం నిర్వహించి నిప్పులు చెరిగారు. వైసీపీ దాడులకు నిరసనగా రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. హెరాయిన్ గురించి మాట్లాడితే ఏమిటి తప్పు? అని ప్రశ్నించారు. ఏపీలో గంజాయి సాగు గురించి పొరుగు రాష్ట్రాల డీజీపీలు చెప్పారని వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి సాగు పెరిగిందని అనడమే టీడీపీ నేతలు చేసిన తప్పా అని నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇవాళ్టి దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు.
తమకు కూడా కోపం, ఆవేశం, బాధ, తపన ఉన్నాయని... అయితే నిగ్రహించుకుంటున్నామని స్పష్టం చేశారు. దాడి విషయం తమకు తెలియదని అంటున్న డీజీపీ ఆ పదవికి అర్హుడా అని ప్రశ్నించారు. "నేను ఫోన్ చేసినా డీజీపీ ఎత్తలేదు. గవర్నర్, కేంద్రమంత్రి ఫోన్ ఎత్తారు కానీ, డీజీపీ ఎత్తడా? ఏమనుకుంటున్నారు? ఎన్ని బాధలున్నా నిగ్రహించుకుంటున్నాం. నా టెంపర్ మెంట్ లూజ్ చేసుకోవడానికి ఒక్క సెకను చాలు. నా ఇంటి గేటుకు తాళ్లు కట్టినప్పటి నుంచి ఈ అరాచకాలు ప్రారంభం అయ్యాయి. రెండున్నరేళ్లుగా మీ దాడులు చూస్తున్నాం... నా మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు. కానీ అది మీ వల్ల కాదు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి" అని చంద్రబాబు పేర్కొన్నారు.