Supreme Court: అర్ధరాత్రి ఒంటిగంట దాకా వేచి చూశాం.. 'లఖింపూర్ ఖేరీ' ఘటన విషయంలో యూపీ ప్రభుత్వంపై సీజేఐ రమణ మండిపాటు

Supreme Court Fires On Uttar Pradesh Government Over Lakhimpur Kheri Incident

  • సాక్షులందరి వాంగ్మూలాలను భద్రం చేయండి
  • కేసు వివరాలను ఇచ్చేందుకు ఇంత జాప్యమా?
  • చివరి నిమిషంలో ఇస్తే మేమెలా చదివేది?
  • కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారంటూ నిలదీత
  • యూపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం

లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించిన వివరాల కోసం అర్ధరాత్రి ఒంటి గంట దాకా వేచి చూశామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మండిపడ్డారు. రైతుల మీదకు కేంద్ర మంత్రి కాన్వాయ్ లోని కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రైతులు... ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, కాన్వాయ్ లోని ఓ కారు డ్రైవర్, ఓ జర్నలిస్టును కర్రలతో కొట్టి చంపారు.


ఈ ఘటనపై ఇవాళ సీజేఐ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. యూపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. సాక్షులందరి వాంగ్మూలాలను భద్రంగా ఉంచాలని ఆదేశించింది. మళ్లీ మళ్లీ అడిగించుకోవద్దని సీజేఐ రమణ సూచించారు. వివరాల అఫిడవిట్ ను అందించేందుకు ఇంత ఆలస్యమెందుకని నిలదీశారు. ఇక జాప్యం వద్దని ఆదేశించారు.

చివరి నిమిషంలో స్టేటస్ రిపోర్టును ఇస్తే తామెలా చదువుతామని అసహనం వ్యక్తం చేశారు. కనీసం విచారణకు ఒక రోజు ముందైనా సమర్పిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. మొత్తం 44 మంది సాక్షులున్నట్టు చెప్పారని, కానీ, ఇప్పటిదాకా నలుగురు సాక్షుల వాంగ్మూలాలనే నమోదు చేస్తే ఎలా? అని నిలదీశారు. మిగతా వారి వాంగ్మూలాలను ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఎంత మందిని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కారుతో గుద్దిన కేసులో ఎంతమందిని, ఆ తర్వాత జరిగిన హత్యల కేసుల్లో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారని నిలదీశారు.

వీలైనంత త్వరగా సాక్షులందరినీ విచారించాల్సిందిగా జస్టిస్ రమణ ఆదేశించారు. కాగా, కావాలనే విచారణలో జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోందని జస్టిస్ హిమా కోహ్లీ యూపీ సర్కార్ పై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలావుంచితే, కేసులో ఇప్పటికే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News