Chandrababu: దాడులు జరుగుతున్నాయని ఫోన్ చేస్తే డీజీపీ స్పందించలేదు.. వెంటనే పార్టీ ఆఫీసుకి వెళ్లాను: చంద్రబాబు
- ప్రజాస్వామ్య స్ఫూర్తికి టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రతిబింబం
- నా ఫోన్ కాల్ తీసుకోవడానికి డీజీపీ నిరాకరించారు
- ప్రణాళిక ప్రకారమే దాడులకు తెగబడ్డారు
- ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏపీలో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరిగిన నేపథ్యంలో చంద్రబాబు ఈ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ప్రజాస్వామ్య స్ఫూర్తికి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ప్రతిబింబమని, అలాంటి కార్యాలయంపై దాడి చేశారని చెప్పారు.
ఈ కార్యాలయం 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమని ఆయన అన్నారు. అందుకే దాడి జరిగిన చోటే తాను దీక్షకు దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ పార్టీనేత పట్టాభి ఇంటిపై కూడా దాడి చేసి విధ్వంసం సృష్టించారని ఆయన చెప్పారు.
తాను రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. విశాఖపట్నంతో పాటు హిందూపురం, కడపలోనూ టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యాలయాలతో పాటు తమ నేతలే లక్ష్యంగా దాడులు జరిగాయని తెలిపారు.
దాడులు జరుగుతున్నాయంటూ డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదని చెప్పారు. తన ఫోన్ కాల్ తీసుకోవడానికి డీజీపీ నిరాకరించారని ఆయన అన్నారు. ప్రణాళిక ప్రకారమే దుండగులు దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. పోలీసులు స్పందించకపోవడంతో తాను వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు.
తమ నేతలను కొట్టి మళ్లీ వారిపైనే కేసులు నమోదు చేయడం ఏంటని ఆయన నిలదీశారు. తమ పార్టీ నేత పట్టాభి వాడిన భాష తప్పు అని అంటున్నారని, మరి సీఎం జగన్ తో పాటు, ఏపీ మంత్రులు వాడిన భాషపై చర్చకు సిద్ధమా? అని చంద్రబాబు సవాలు విసిరారు.