Atchannaidu: ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీదే అధికారం: అచ్చెన్నాయుడు
- దాడులు చేసిన వారి పేర్లను రాసి పెట్టండి
- టీడీపీ కార్యకర్తలకు సూచించిన అచ్చెన్న
- అధికారంలోకి రాగానే వారి సంగతి తేలుస్తామని కామెంట్
ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీదే అధికారం అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దాడులకు పాల్పడుతున్న వైఎస్సార్ సీపీ నేతలు, పోలీసులు, అధికారుల చిట్టా రాసిపెట్టాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు. అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
తెలుగు దేశం పార్టీని భూస్థాపితం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలలు కంటున్నారని, కానీ, అది తన తాత, తన తండ్రి వల్లే కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, దానిని ఎవరూ ఏం చేయలేరని అన్నారు. చంద్రబాబు చేస్తున్న దీక్షలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్లు చేశారు. అధికారాన్ని ఉపయోగించి టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీసినా.. వైఎస్సార్సీపీ అరాచకాలను ఎదిరిస్తున్నామన్నారు.
ఈ రెండేళ్లలో టీడీపీ నేతలపై దాడులు భారీగా పెరిగాయని అన్నారు. వైఎస్సార్సీపీ అరాచక, అవినీతి పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ లు కలిసి ఇదివరకే చంద్రబాబు ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. తాజాగా దేవాలయం లాంటి టీడీపీ ఆఫీసులపై దాడులకు ఒడిగట్టారన్నారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా ఏపీ మూలాలుంటున్నాయని మండిపడ్డారు. ఇదే విషయాన్ని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసులు చెబుతున్నారని ఆయన అన్నారు. పట్టాభి ఇంటిపై దాడి జరిగి రెండు రోజులవుతున్నా ఇంతవరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.