Gangula Kamalakar: మూడో 'ఆర్'ను అసెంబ్లీకి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు: మంత్రి గంగుల
- కేసీఆర్ బొమ్మతోనే హుజూరాబాద్ లో గెలుస్తాం
- సంక్షేమ పథకాల ఫలాలు సామాన్యులందరికీ అందుతున్నాయి
- బీజేపీకి రైతులెవరూ ఓటు వేయవద్దు
హుజూరాబాద్ ఉపఎన్నికను కేవలం కేసీఆర్ బొమ్మ, టీఆర్ఎస్ జెండాతోనే గెలవబోతున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు సామాన్యులకు అందుతున్నాయని చెప్పారు.
రైతుబంధు, దళితబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంట్ తదితర ఎన్నో పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామంటూ కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన బీజేపీకి రైతులెవరూ ఓటు వేయవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు.
బీజేపీకి చెందిన రెండు 'ఆర్'లు అయిన రఘునందన్ రావు, రాజాసింగ్ లను గెలిపించి ఇప్పటికే ప్రజలు తప్పు చేశారని... మరో 'ఆర్' అయిన రాజేందర్ ను అసెంబ్లీకి పంపించే అవకాశమే లేదని చెప్పారు. హుజూరాబాద్ ఓటర్లు గతంలో టీఆర్ఎస్ కు ఓటు వేశారని... ఇప్పుడు కూడా గతం కంటే ఎక్కువ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ లోని 16, 17 వార్డుల్లో గంగుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.