Pattabhi: టీడీపీ నేత పట్టాభిని విజయవాడ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు... 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం
- సీఎంను దూషించారంటూ పట్టాభిపై ఫిర్యాదు
- గవర్నర్ పేట పీఎస్ లో కేసు నమోదు
- తోట్లవల్లూరు నుంచి పట్టాభిని విజయవాడ తరలించిన పోలీసులు
- కోర్టులో ముగిసిన వాదనలు
సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను పోలీసులు నేడు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. పట్టాభిని ఈ మధ్యాహ్నం తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడకు తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
వాదనల సందర్భంగా... పట్టాభికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ, పట్టాభిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను మచిలీపట్నం జైలుకు తరలించారు. సీఎం జగన్ ను అసభ్య పదజాలంతో దూషించారన్న ఫిర్యాదు మేరకు పట్టాభిపై విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడం తెలిసిందే.
విచారణ సందర్భంగా పట్టాభి తరఫు న్యాయవాది స్పందిస్తూ... గతంలోనూ పలుమార్టు పట్టాభి నివాసంపై దాడులు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పట్టాభి తన మీడియా సమావేశాల్లో ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపారే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదని వివరించారు. పట్టాభికి, ఆయన కుటుంబ సభ్యులు ప్రాణహాని ఉందని న్యాయమూర్తికి విన్నవించారు.