Kishan Reddy: రామప్ప దేవాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
- రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు
- ప్రధాని మోదీ చలవేనన్న కిషన్ రెడ్డి
- వద్దన్న దేశాలతోనే "అద్భుతం" అని చెప్పించారని వెల్లడి
- పలు కట్టడాలకు గుర్తింపు లభించాల్సి ఉందని వివరణ
తెలంగాణకే తలమానికంగా నిలిచే రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించడం తెలిసిందే. తాజాగా ములుగు జిల్లాలోని రామప్ప గుడిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆలయ వర్గాలు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. కిషన్ రెడ్డి రామప్ప గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిన శిల్పకళా వైభవాన్ని, ఆలయ నిర్మాణ శైలిని ఆసక్తిగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక దేశాలు అడ్డుకున్నప్పటికీ రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు వద్దన్న దేశాలతోనే "ఆలయం అద్భుతం" అని చెప్పించిన ఘనత ప్రధానికి దక్కుతుందని వివరించారు. రామప్ప ఆలయం అభివృద్ధికి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ఇంకా చాలా కట్టడాలు గుర్తింపుకు నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు.
కాగా రామప్ప గుడిని సందర్శించిన సమయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంట రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ములుగు శాసనసభ్యురాలు సీతక్క తదితరులు ఉన్నారు.