Bangladesh: టీ20 వరల్డ్ కప్: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ భారీ స్కోరు
- బంగ్లాదేశ్ వర్సెస్ పాపువా న్యూ గినియా
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
- అర్ధసెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ మహ్మదుల్లా
- రాణించిన షకీబ్.. సైఫుద్దీన్ మెరుపులు
- బంగ్లా స్కోరు 181 పరుగులు
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశకు చేరాలంటే పాపువా న్యూ గినియాపై తప్పక నెగ్గాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. పెద్దగా అంతర్జాతీయ అనుభవంలేని పాపువా న్యూ గినియా బౌలర్లు బంగ్లా బ్యాటింగ్ లైనప్ ను కట్టడి చేసేందుకు తమ శక్తిమేర శ్రమించారు. అయితే, కెప్టెన్ మహ్మదుల్లా, షకీబ్ అల్ హసన్ ధాటిగా ఆడడంతో స్కోరుబోర్డు ముందుకు ఉరికింది.
మహ్మదుల్లా 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 50 పరుగులు చేయగా, షకీబ్ 37 బంతుల్లో 3 సిక్స్ ల సాయంతో 46 పరుగులు సాధించాడు. చివర్లో సైఫుద్దీన్ 6 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్స్ లతో చకచకా 19 పరుగులు రాబట్టాడు. హుస్సేన్ (14 బంతుల్లో 21) రాణించాడు. ఓపెనర్ నయీం (0), సీనియర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీం (5) విఫలమయ్యారు. పాపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మొరియా 2, డామియెన్ రవూ 2, కెప్టెన్ అసద్ వాలా 2, సైమన్ అతాయ్ 1 వికెట్ తీశారు.