TDP: ఏపీ గవర్నర్ ను కలిసిన టీడీపీ ప్రతినిధుల బృందం
- పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో దాడి ఘటనలు
- గవర్నర్ వద్దకు వెళ్లిన అచ్చెన్న, యనమల, వర్ల తదితరులు
- గవర్నర్ కు ఫిర్యాదు
- వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ వినతి
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటి వద్ద విధ్వంసం తదితర పరిణామాల నేపథ్యంలో, టీడీపీ ప్రతినిధుల బృందం ఈ సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, రామానాయుడు విజయవాడలో రాజ్ భవన్ కు విచ్చేసి గవర్నర్ తో భేటీ అయ్యారు.
మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంపైనా, తమ నేతలపైనా దాడులు చేశారంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. దాడులపై వీడియో ఫుటేజిని కూడా గవర్నర్ కు అందజేశారు. రాష్ట్రంలో 356 ఆర్టికల్ విధించాలని, దాడి ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.