Nara Lokesh: 2024లో మంగళగిరిలో టీడీపీని గెలిపించి కానుకగా ఇస్తా: నారా లోకేశ్
- చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారన్న లోకేశ్
- టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడనక్కర్లేదని భరోసా
- వైసీపీకి ట్రైలర్ మాత్రమే చూపించామని వెల్లడి
- సినిమా ముందుందని హెచ్చరిక
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో గంజాయి పరిశ్రమ బాగా నడుస్తోందని తెలిపారు. యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని, యువత భవిష్యత్తుపై ప్రశ్నిస్తే టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఎవరూ లేని సమయంలో దాడి చేయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. దాడులు చేయాలని పోలీసులే ప్రేరేపించే పరిస్థితి నెలకొందని లోకేశ్ ఆరోపించారు.
దమ్ముంటే పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయటికి రావాలని సవాల్ విసిరారు. కొన్ని పిల్లులు తమను తాము పులులు అనుకుంటున్నాయని వ్యంగ్యం ప్రదర్శించారు. పసుపు జెండా చూస్తే హడలిపోతుంటారని ఎద్దేవా చేశారు. ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయగొడతామని స్పష్టం చేశారు.
టీడీపీ కార్యాలయంలో పగిలింది అద్దాలు మాత్రమే... మా కార్యకర్తల హృదయాలను మీరు గాయపర్చలేరు అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పారు. రెండున్నరేళ్లు ఆగండి... చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారు అంటూ లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడనక్కర్లేదని ధైర్యం చెప్పారు. 2024లో మంగళగిరిలో టీడీపీని గెలిపించి కానుకగా ఇస్తానని ఉద్ఘాటించారు.
జగన్ లా తానేమీ చిన్నాన్న జోలికి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. జగన్ అంత సమర్థుడే అయితే వాళ్ల చిన్నాన్న కేసు తేల్చాలని స్పష్టం చేశారు. వైసీపీకి ట్రైలర్ మాత్రమే చూపించామని, సినిమా ముందుందని హెచ్చరించారు.
ఇక ట్విట్టర్ లో స్పందిస్తూ గంజాయి వ్యవహారంపై నిలదీశారు. ఏ రాష్ట్రంలో ఏ గంజాయి ముఠాను పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ పేరే చెబుతున్నారని లోకేశ్ అన్నారు. దేశంలో ఏ మూల డ్రగ్స్ పట్టుకున్నా ఏపీతోనే లింకు అని తెలిపారు. ఇది తాను చెప్పడం కాదని, వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు వెల్లడిస్తున్న కఠోర వాస్తవం అని స్పష్టం చేశారు.
ఏపీకి డ్రగ్స్, గంజాయితో సంబంధంలేదని సీఎం, డీజీపీ చెబుతున్నారని, కానీ దేశవ్యాప్తంగా పోలీసు విభాగాలు, నిఘా వ్యవస్థలు మాత్రం ఏపీనే డ్రగ్స్ హబ్ అని కోడై కూస్తున్నాయని వివరించారు. మరి వాళ్లందరికీ కూడా నోటీసులు ఇస్తారా? విచారణకు పిలుస్తారా? ఇప్పుడేం చేస్తారు? అంటూ ప్రశ్నించారు.