Kishan Reddy: బీజేపీ ర్యాలీని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు... కిషన్ రెడ్డి ఆగ్రహం
- ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
- హోరాహోరీగా ప్రచారం
- ఈటల తరఫున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం
- బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా, బీజేపీ వర్గాల ప్రచారం ముమ్మరం చేశాయి. నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలో నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. అయితే సిరిసేడు వద్ద బీజేపీ ర్యాలీని టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. దాంతో పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. దీనిపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే తమను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
ఇక, ఇల్లందకుంట మండలం బుజునూరు వద్ద కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ ఆత్మాభిమానానికి, కేసీఆర్ అహంకార ధోరణికి మధ్య జరుగుతున్న పోరాటమే హుజూరాబాద్ ఉప ఎన్నిక అని స్పష్టం చేశారు. ధర్మం ఈటల వైపే ఉందని, అక్రమంగా సంపాదించిన డబ్బుతో కేసీఆర్ గెలవాలని ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫాంహౌస్ పాలన కావాలో, సంక్షేమ పాలన కావాలో ఓసారి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.