PhonePe: ప్రాసెసింగ్ ఫీజు పేరుతో కొత్త బాదుడు మొదలుపెట్టిన ఫోన్‌పే
- మొబైల్ రీచార్జ్ రూ. 50 దాటితే ప్రాసెసింగ్ ఫీజు వసూలు
- ఆ లోపు పూర్తిగా ఉచితం
- నిర్ణయం తీసుకోని ఇతర సంస్థలు
ప్రాసెసింగ్ ఫీ పేరుతో వినియోగదారుల నుంచి రుసుము వసూలు చేసేందుకు డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే రెడీ అయింది. రూ. 50 పైన చేసే మొబైల్ రీచార్జ్‌లపై రూ. 1-2 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించడం మొదలుపెట్టిన తొలి సంస్థగా ఫోన్‌పే రికార్డులకు ఎక్కనుంది.
50 రూపాయల లోపు చేసే రీచార్జ్‌లు మాత్రం పూర్తిగా ఉచితమని, ఆపై 100 రూపాయల వరకు రూపాయి, అది దాటితే రూ. 2 వసూలు చేస్తామని ఫోన్‌పే తెలిపింది. గత నెలలో ఏకంగా 165 కోట్ల యూపీఐ లావాదేవీలు నిర్వహించింది.
కాగా, ఇతర డిజిటల్ చెల్లింపు యాప్‌లు మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై మాత్రం ఫోన్‌పేతోపాటు ఇతర యాప్‌లు కూడా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి.