Gutha Sukender Reddy: తెలంగాణ వనరులను దోచుకునేందుకు ఈ ముగ్గురు ముందుకు వస్తున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి
- రేవంత్, సంజయ్, షర్మిలలు రాష్ట్ర వనరులను దోచుకునేందుకు వస్తున్నారు
- రాష్ట్రాన్ని, కేసీఆర్ ను అపవిత్రం చేయాలని చూస్తున్నారు
- హుజూరాబాద్ లో విపక్షాలకు ఓటమి తప్పదు
రాష్ట్రంలో ఉన్న వనరులన్నింటినీ దోచుకునేందుకు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, వైయస్ షర్మిల ముందుకు వస్తున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను అపవిత్రం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో అవకాశం లేకపోవడం వల్లే హైదరాబాద్, తెలంగాణపై పెత్తనం చెలాయించాలనే ఆలోచనతో షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారని అన్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో విపక్షాలకు పరాభవం తప్పదని, టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని... ఈ ధరలను తగ్గించాలనే ఆలోచన కేంద్రంలోని బీజేపీకి లేదని విమర్శించారు. హుజూరాబాద్ లో ఓటు అడిగే నైతిక హక్కు కూడా బీజేపీకి లేదని అన్నారు.