Cricket: కేవలం మెంటార్ గానే కాదు.. ధోనీకి మరో కొత్త బాధ్యతనూ ఇచ్చిన బీసీసీఐ!
- త్రోడౌన్ స్పెషలిస్ట్ గా మాజీ సారథి
- బ్యాట్స్ మెన్ కు బంతి విసిరిన మహీ
- ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన బీసీసీఐ
టీమిండియాకు మరో కప్ అందించడం కోసం ఇప్పటికే మాజీ సారథి ధోనీని రంగంలోకి దింపింది బీసీసీఐ. టీమిండియాకు మెంటార్ గా నియమించింది. టీ20, వన్డే కప్ ప్రపంచ కప్ లను అందించిన అతడి అమూల్యమైన సలహాలు జట్టుకు ఎంతో మేలు చేస్తాయని భావించి అంత పెద్ద బాధ్యతను అప్పగించింది.
అయితే, తాజాగా మరో బాధ్యతనూ ధోనీ భుజాలకు ఎత్తింది బీసీసీఐ. మరో కొత్త పాత్రను అందించింది. ‘టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్ట్’ అంటూ బీసీసీఐ ట్విట్టర్ లో వెల్లడించింది. రేపు దాయాది పాకిస్థాన్ తో భారత్ తన తొలి మ్యాచ్ లో తలపడనున్న సంగతి తెలిసిందే.
దీంతో మ్యాచ్ కోసం జట్టు బ్యాటింగ్, బౌలింగ్ పై కఠోర సాధన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ధోనీ బ్యాటర్లకు బాల్ ను విసురుతూ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఆ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన బీసీసీఐ.. ‘‘టీమిండియా నూతన త్రోడౌన్ స్పెషలిస్ట్ ను పరిచయం చేస్తున్నాం’’ అంటూ ట్వీట్ చేసింది. కాగా, 2007లో ఆరంభ టీ20 కప్ నే భారత్ కు అందించిన ధోనీ.. ఆ తర్వాత నాలుగేళ్లకు 2011లో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీనీ అందించిన సంగతి తెలిసిందే.