Raghu Rama Krishna Raju: వైఎస్ జగన్ కేసుల విచారణపై సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్
- జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలన్న రఘురామ
- జగన్ కడిగిన ముత్యంలా బయటపడాలి
- అప్పుడెవరూ వేలెత్తిచూపరని వ్యాఖ్య
- గతంలో బెయిల్ రద్దు పిటిషన్ వేసిన రఘురామ
ఏపీ సీఎం జగన్ పై కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన రోజువారీ మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడుతూ, ఈ పిటిషన్ ను నిన్న దాఖలు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసుల విచారణ త్వరగా జరిగితే జగన్ కూడా కడిగిన ముత్యంలా బయటపడతాడు కదా అని రఘురామ వ్యాఖ్యానించారు.
చార్జిషీట్లు నమోదైన కేసుల్లో సంవత్సరం లోగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని తెలిపారు. జగన్ కేసుల విచారణ త్వరగా పూర్తయితే ఇక ఆయనను ఎవరూ వేలెత్తి చూపేందుకు వీలుండదు అని రఘురామ వ్యాఖ్యానించారు. కిందికోర్టుల్లో కొట్టేసినట్టు తన పిటిషన్ ను సుప్రీంకోర్టులో కొట్టివేయరని భావిస్తున్నట్టు తెలిపారు.
అయితే తాను గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లతో తాజా పిటిషన్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. అప్పట్లో కూడా తాను జగన్ బెయిల్ రద్దయి విచారణ వేగంగా జరిగితే ఆయన నీలాపనిందలు లేకుండా బయటపడతాడన్న ఉద్దేశంతోనే బెయిల్ రద్దు పిటిషన్ వేశానని వివరించారు.