Pakistan: ఇకపై టీవీ సీరియళ్లలో కౌగిలింతలు, ముద్దు సీన్లు బంద్.. పాక్ ప్రభుత్వం నిర్ణయం
- ప్రసారానికి ముందు అలాంటి సీన్లు ఉంటే తొలగించాల్సిందే
- అవి పాకిస్థాన్ సమాజపు అసలైన సంస్కృతికి ప్రతిబింబం కాదన్న ప్రభుత్వం
- ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత
టీవీ సీరియళ్లలో మితిమీరుతున్న శృంగార సీన్లపై పాకిస్థాన్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇక నుంచి సీరియళ్లలో కౌగిలింతలు, ముద్దులు, పడకసీన్లు ఉండకూడదని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) టీవీ చానళ్లను ఆదేశించింది. ఇలాంటి కంటెంట్ ఇటీవల మితిమీరడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు, ఆ కార్యక్రమాలు పాకిస్థాన్ సమాజపు అసలైన సంస్కృతిని ప్రతిబింబించడం లేదని కూడా పేర్కొంది. సీరియళ్లలో వివాహేతర సంబంధాలు, అసభ్యకరమైన దృశ్యాలు, కౌగిలింతలు, పడక సన్నివేశాలు, జంటల మధ్య సాన్నిహిత్యం లాంటివి ఇస్లామిక్ బోధనలు, దేశ సంస్కృతిని విస్మరిస్తున్నాయని పీఈఎంఆర్ఏ తెలిపింది.
టీవీ చానళ్లు తమ సీరియళ్ల కంటెంట్‌ను ముందుగా అంతర్గత కమిటీ పర్యవేక్షణ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్షించాలని, అలాంటి దృశ్యాలుంటే కత్తిరించాలని, ఆ తర్వాతే వాటిని ప్రసారం చేయాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలపై వేధింపులు, పరువు హత్యలను పట్టించుకోని ప్రభుత్వం, ఎవరో ఫిర్యాదు చేశారని చెప్పి ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం తగదని అంటున్నారు.