Andhra Pradesh: హాజరు లేదంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కోత
- 10 నుంచి 50 శాతం వరకు కోతపెట్టిన ప్రభుత్వం
- హాజరు వివరాలను జిల్లాలకు పంపించిన ప్రభుత్వం
- దాని ప్రకారమే వేతనాలు ఇవ్వాలని ఆదేశం
- ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాకిచ్చింది. బయోమెట్రిక్ హాజరు లేదంటూ అక్టోబరు వేతనంలో కొందరికి రూ. 10 శాతం, మరికొందరిరికి 50 శాతం కోత విధించింది. గత నెల 23 నుంచి ఈ నెల 22 వరకు ఉద్యోగుల హాజరు వివరాలు జిల్లాలకు చేరాయి. దీని ఆధారంగానే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని డ్రాయింగ్, డిజ్బర్స్‌మెంట్ అధికారులను (డీడీవో) గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు పేరుకుపోయాయని, వాటిని పరిష్కరించకుండా హాజరు లేదంటూ వేతనాల్లో కోత విధించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు సరిచేసి మరోమారు హాజరు, జీతాల డేటాను రూపొందించాలని కోరారు. బయోమెట్రిక్ హాజరు యాప్‌తో సంబంధం లేకుండా గతంలో లానే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని, అలాగే, ప్రొబేషన్ ప్రక్రియను పూర్తి చేసి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలని సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.