Sri Lanka: టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ పై శ్రీలంక 'సూపర్' చేజ్
- కొనసాగుతున్న శ్రీలంక జైత్రయాత్ర
- బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో విజయం
- సూపర్-12లో శుభారంభం
- క్యాచ్ లు వదిలి మ్యాచ్ ను కోల్పోయిన బంగ్లాదేశ్
టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి దశలో ఒక్క ఓటమి చవిచూడకుండా సూపర్-12కి చేరుకున్న లంక జట్టు... నేడు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లోనూ అదే ఒరవడి కొనసాగించింది. కళ్ల ముందు భారీ లక్ష్యం నిలిచినా, వెనుకంజ వేయకుండా, పోరాటమే స్ఫూర్తిగా అద్భుత ప్రదర్శన కనబర్చింది. బంగ్లాదేశ్ విసిరిన 172 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని శ్రీలంక 18.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది.
శ్రీలంక ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే చరిత్ అసలంక (49 బంతుల్లో 80 నాటౌట్), భానుక రాజపక్స (31 బంతుల్లో 53 నాటౌట్) ఆటతీరు గురించే చెప్పుకోవాలి. అసలంక స్కోరులో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. రాజపక్స 3 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు పలు క్యాచ్ లు వదిలి తగిన మూల్యం చెల్లించుకున్నారు.