Mohammad Shami: మహ్మద్ షమీ... మేమందరం నీ వెంటే: రాహుల్ గాంధీ, సచిన్
- టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో భారత్ ఓటమి
- షమీపై వెల్లువలా ట్రోలింగ్
- షమీకి ప్రముఖుల మద్దతు
- సోషల్ మీడియాలో స్పందించిన రాహుల్, సచిన్
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మహ్మద్ షమీ... మేమందరం నీ వెంటే అంటూ సంఘీభావం ప్రకటించారు. "ఈ ప్రజలు నిలువెల్లా ద్వేషంతో నిండిపోయారు. ఎందుకంటే వారిని ఎవరూ ప్రేమించరు కాబట్టి. అలాంటి వారిని క్షమించి వదిలేయ్" అంటూ ట్వీట్ చేశారు.
అటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు. "టీమిండియాకు మద్దతు ఇస్తున్నామంటే, టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే ప్రతి ఒక్కరికీ మద్దతిస్తున్నట్టే. మహ్మద్ షమీ అంకితభావం శంకించలేనిది. అతనో ప్రపంచస్థాయి బౌలర్. ప్రతి క్రీడాకారుడు ఏదో ఒక రోజున విఫలం కావడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో నేను షమీకి, టీమిండియాకు సంఘీభావం తెలుపుతున్నా" అంటూ సచిన్ సోషల్ మీడియాలో స్పందించారు.