Madhavan: స్విమ్మింగ్ పోటీల్లో అదరగొడుతున్న నటుడు మాధవన్ తనయుడు.. ఏడు పతకాలతో రికార్డు
- బెంగళూరులో జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్స్
- మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన వేదాంత్
- నాలుగు రజత, మూడు కాంస్య పతకాలు
ప్రముఖ నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ (16) స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోని బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో జరిగిన ‘47వ జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్స్ 2021’లో ఏకంగా ఏడు పతకాలు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ ట్విట్టర్ ద్వారా తెలుపుతూ వేదాంత్‌ను ప్రశంసించారు. మీ ప్రదర్శనకు గర్విస్తున్నామని పేర్కొన్నారు.
కాగా, ఈ పోటీల్లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన వేదాంత్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్, 1500 మీటర్ల ఫ్రీ స్టైల్, 4X200 ఫ్రీ స్టైల్ రిలోలో రజత పతకాలు సాధించగా, 100, 200, 400 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో కాంస్య పతకాలు అందుకున్నాడు. ఈ పోటీల్లో కర్ణాటక చాంపియన్‌గా నిలిచింది. కాగా, మార్చిలో జరిగిన లాట్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో వేదాంత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు.