Shilpa Chakrapani Reddy: వర్థన్ సొసైటీతో నాకు సంబంధం లేదు: శిల్పా చక్రపాణిరెడ్డి
- వర్ధన్ సొసైటీ మన బ్యాంక్ అని మాత్రమే చెప్పాను
- అందులో డిపాజిట్లు చేయాలని ఎప్పుడూ చెప్పలేదు
- బుడ్డా రాజశేఖరరెడ్డి నాతో చర్చకు వస్తారా?
కర్నూలు జిల్లా ఆత్మకూరులో వర్ధన్ సొసైటీ చేసిన మోసాలకు ఎంతోమంది అమాయకులు బలయ్యారు. ఈ విషయంలో వైసీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చక్రపాణి రెడ్డి స్పందిస్తూ... వర్ధన్ సొసైటీ మన బ్యాంకే అని మాత్రమే చెప్పానని... అందులో డిపాజిట్లు చేయమని తాను చెప్పలేదని అన్నారు.
వర్ధన్ సొసైటీ నిర్వాహకుడు బలన్నను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. వర్ధన్ సొసైటీలో తన హస్తం ఉందని చెపుతున్న మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తనతో చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. ఆయన నోరుమూసుకుని ఉంటే బాగుంటుందని... లేకపోతే ఆయన చిట్టా విప్పుతానని హెచ్చరించారు.
వర్ధన్ సొసైటీ అంశంలోకి వస్తే... బహుళ రాష్ట్ర సహకార సంస్థ లిమిటెడ్ పేరుతో భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సొసైటీ తమను మోసం చేసిందని కస్టమర్లు వాపోతున్నారు. జిల్లా ఎస్పీకి కూడా కొందరు ఫిర్యాదు చేశారు. మహేశ్ అలియాస్ జోసెఫ్ కోట్లాది రూపాయల మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.