Nafeesa Attari: పాక్ చేతిలో భారత్ ఓటమి అనంతరం.. 'మేం గెలిచాం' అంటూ రాజస్థాన్ మహిళా టీచర్ సంబరం... కేసు నమోదు

Case filed against a Rajasthan school teacher

  • టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాక్ విజయం
  • వాట్సాప్ స్టేటస్ పెట్టిన టీచర్
  • ఉద్యోగం నుంచి తొలగించి స్కూలు యాజమాన్యం
  • క్షమాపణలు చెప్పిన లేడీ టీచర్

దుబాయ్ లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలవడం తెలిసిందే. అయితే, రాజస్థాన్ లో ఓ ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయురాలు ఈ మ్యాచ్ అనంతరం మేం గెలిచాం అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడం తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఆ మహిళా టీచర్ పేరు నఫీసా అట్టారీ. ఉదయ్ పూర్ లోని నీరజా మోదీ స్కూల్లో విద్యాబోధన చేస్తున్నారు.

పాకిస్థాన్ గెలుపు పరుగులు సాధించిన వెంటనే సంబరాలు చేసుకున్న నఫీసా... జీత్ గయీ... వుయ్ వన్ (మేం గెలిచాం) అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టారు. కొద్దివ్యవధిలోనే ఇది వైరల్ అయింది. సదరు లేడీ టీచర్ తీరును తీవ్రంగా పరిగణించిన స్కూలు యాజమాన్యం ఆమెను ఉద్యగం నుంచి తొలగించింది. అంతేకాదు, స్థానిక అంబా మాతా పోలీస్ స్టేషన్ లో నఫీసా అట్టారీపై సెక్షన్ 153 కింద కేసు కూడా నమోదైంది.

దీనిపై ఆ ఉపాధ్యాయురాలు అందరికీ క్షమాపణలు తెలుపుతూ ఓ వీడియో సందేశం పంపారు. ఎవరి మనోభావాలను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.  తమ మిత్రులతో సరదాగా జరిగిన సంభాషణలో భాగంగా పాకిస్థాన్ కు మద్దతు ఇస్తావా అని అడిగారని, తాను అవునని చెప్పానని వివరణ ఇచ్చారు. అంతేతప్ప తాను పాకిస్థాన్ దేశానికి మద్దతు ఇస్తున్నట్టు కాదని, తాను భారతీయురాలని, భారతదేశాన్ని ప్రేమిస్తానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News