Sanjiv Goenka: లక్నో ఐపీఎల్ ఫ్రాంచైజీకి అంత ధర సముచితమే: ఆర్పీజీ అధినేత గోయెంకా
- ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు
- లక్నో ఫ్రాంచైజీని రూ.7 వేల కోట్లతో సొంతం చేసుకున్న ఆర్పీఎస్జీ
- అదేమంత ఎక్కువ ధర కాదన్న ఆర్పీఎస్జీ చైర్మన్
- దాని విలువ రూ.10 వేల కోట్లకు చేరుతుందని ధీమా
ఐపీఎల్ లో కొత్తగా అవకాశం దక్కించుకున్న రెండు జట్లలో లక్నో ఒకటి. లక్నో ఫ్రాంచైజీని ఆర్పీఎస్జీ గ్రూప్ రూ.7,090 కోట్లకు బిడ్ వేసి దక్కించుకుంది. దీనిపై ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయెంకా స్పందించారు.
లక్నో ఫ్రాంచైజీ కోసం అంత ధర పెట్టడం సమంజసమేనని అన్నారు. ఇదేమంత ఎక్కువ ధర అని అనుకోవడంలేదని అభిప్రాయపడ్డారు. తాము ఇంత ధరను బిడ్ చేయడం వెనుక ఆర్థిక, శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయని వివరించారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో లక్నో ఫ్రాంచైజీ విలువ రూ.10 వేల కోట్లకు చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో బిడ్డింగ్ వేయడం తనకు ఓ హాబీలా ఉండేదని, ఇప్పుడది వ్యాపారంలా పరిగణిస్తున్నానని వెల్లడించారు.
ప్రధానంగా లక్నో ఫ్రాంచైజీనే కొనుగోలు చేయడం వెనుక కారణాన్ని వివరిస్తూ... ఉత్తరప్రదేశ్ లో తమ వ్యాపారాభివృద్ధికి సహకరిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. తమ వ్యాపారానికి యూపీ కీలకంగా ఉందని పేర్కొన్నారు.
గతంలో ఆర్పీఎస్జీ గ్రూప్ ఐపీఎల్ లో పూణే సూపర్ జెయింట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అయితే, ఆ ఫ్రాంచైజీ కాలపరిమితి స్వల్పం కావడంతో ఈ ప్రస్థానం కొంతకాలానికే ముగిసింది. ఇప్పుడు లక్నో ఫ్రాంచైజీ శాశ్వత ప్రాతిపదికన కొనుగోలు చేయడంతో ఆర్పీఎస్జీ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.