Chandrababu: చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్ షా.. వివరాలను అడిగి తెలుసుకున్న వైనం!
- ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను కలవలేకపోయిన చంద్రబాబు
- జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి
- ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల కలవలేకపోయానన్న అమిత్ షా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి జరిగిన పరిణామాలపై చంద్రబాబు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో డగ్స్, గంజాయి అంశాలపై కూడా రాష్ట్రపతికి నివేదిక సమర్పించారు.
ఇదే సమయంలో అమిత్ షా అపాయింట్ మెంట్ ను కూడా ఆయన కోరారు. అయితే ఆ సమయంలో అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. నిన్న మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో అమిత్ ను చంద్రబాబు కలవడం కుదరలేదు.
ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల తాను కలవలేకపోయానని... త్వరలో కలుద్దామని చంద్రబాబుకు ఆయన తెలిపారు. తనను ఎందుకు కలవాలనుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ పరిస్థితులపై నివేదికను తయారు చేశామని, దాన్ని పంపుతామని అమిత్ షాకు ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
ఇదే సమయంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా తదితర అంశాలతో పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన ఆవశ్యకతను హోంమంత్రికి వివరించారు. పూర్తి సమాచారాన్ని వీడియోలతో పాటు పంపుతానని... తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.