Prashant Kishor: బీజేపీ రాబోయే కొన్ని దశాబ్దాలపాటు ఉంటుంది.. రాహుల్ కి ఇది అర్థం కావడం లేదు: ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
- స్వాతంత్య్రం వచ్చిన తొలి 40 ఏళ్లు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఉంది
- ఇప్పుడు ఆ స్థానంలోకి బీజేపీ వచ్చింది
- మోదీ పోవచ్చు... బీజేపీ మాత్రం ఉంటుంది
- బీజేపీని ప్రజలు సాగనంపుతారని రాహుల్ అనుకుంటున్నారు
- రాహుల్ భావిస్తున్నట్టుగా అది జరగడం లేదు
భారత భవిష్యత్ రాజకీయాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో బీజేపీదే ప్రముఖ స్థానమని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో వచ్చిన సమస్య ఏమిటంటే... ఈ విషయాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీతో ప్రశాంత్ కిశోర్ చేతులు కలపబోతున్నారని... ఆయనకు పార్టీలో కీలక స్థానం దక్కబోతోందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గాంధీలతో ఆయన భేటీ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు... ఆయనకు, కాంగ్రెస్ కు మధ్య జరిగిన చర్చలు విఫలమైనట్టుగా కనిపిస్తున్నాయి. ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో మాట్లాడుతూ ప్రశాంత్ కిశోర్ తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. ఆయన ఏం చెప్పారో చూద్దాం.
'రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత రాజకీయాలు బీజేపీ చుట్టూనే తిరుగుతాయి. ఆ పార్టీ గెలిచినా, ఓడినా బలమైన శక్తిగా ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి 40 ఏళ్లు భారత రాజకీయాల్లో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఉంది. ఇప్పుడు ఆ స్థానం బీజేపీకి వచ్చింది. దేశ స్థాయిలో 30 శాతానికంటే ఎక్కువ ఓట్లను సాధించిన పార్టీ... దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది. తక్కువ సమయంలో అలాంటి పార్టీ పతనమవడం అసాధ్యం.
బీజేపీపై, ప్రధాని మోదీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని... ఆ పార్టీని ప్రజలు తిరస్కరించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఉచ్చులో పడకండి. ప్రజలు మోదీని సాగనంపవచ్చు... కానీ, బీజేపీని మాత్రం కాదు. బీజేపీ ఎక్కడికీ పోదు. శక్తిమంతమైన స్థానంలోనే ఉంటుంది. రాబోయే కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలకు కేంద్ర స్థానంగానే ఉంటుంది.
అయితే, రాహుల్ గాంధీకి ఈ విషయం అర్థం కావడం లేదు. సమయం వచ్చినప్పుడు బీజేపీని ప్రజలు తిప్పికొడతారనే భావనలో రాహుల్ ఉన్నారు. కానీ అది జరగడం లేదు. పరిస్థితులను సమీక్షించుకుని, అర్థం చేసుకుని, వారికి (మోదీ) ఉన్న శక్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటే తప్ప... వారిని ఓడించే విషయంలో మీరు కనీసం పోటీ కూడా పడలేరు' అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం గోవాలో ఉన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ తరపున ఆయన పని చేస్తున్నారు. వచ్చే ఏడాది గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయబోతోంది. ప్రశాంత్ కిశోర్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.