Australia: టీ20 ప్రపంచకప్.. శ్రీలంకపై ఆసీస్ సునాయాస విజయం
- శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గిన ఆస్ట్రేలియా
- 42 బంతుల్లో10 ఫోర్లతో 65 పరుగులు చేసిన వార్నర్
- పొదుపుగా బౌలింగ్ చేసిన జంపాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గత రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సునాయాస విజయాన్ని అందుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (42 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు), కెప్టెన్ అరోన్ ఫించ్ (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు), స్టీవ్ స్మిత్ అజేయంగా 28 పరుగులు చేయడంతో శ్రీలంక నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే అందుకుంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కుశాల్ పెరీరా (35), అసలంక (35), బి.రాజపక్స (33 నాటౌట్) రాణించడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమిన్స్, జంపా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పొదుపుగా బౌలింగ్ చేసిన ఆడం జంపాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.