South Africa: క్షమాపణలు చెప్పిన సౌతాఫ్రికా వికెట్ కీపర్ డికాక్.. మోకాలిపై కూర్చుంటానని వివరణ
- బీఎల్ఎంకు మద్దతు ప్రకటించడం ఇష్టం లేక విండీస్‌తో మ్యాచ్ నుంచి తప్పుకున్న డికాక్
- క్రికెట్ భవితవ్యం సందిగ్ధంలో పడడంతో క్షమాపణ
- జట్టు, దేశం కోరుకుంటే మళ్లీ ఆడతానన్న డికాక్
- తను కూడా రెండు వర్ణాలు కలిగిన కుటుంబం నుంచే వచ్చానన్న డికాక్
- జాత్యహంకారి అని పిలవడం బాధించిందని ఆవేదన
‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (బీఎల్ఎం) ఉద్యమానికి మద్దతు ప్రకటించేందుకు నిరాకరించి విమర్శలు పాలైన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ఎట్టకేలకు దిగివచ్చాడు. బీఎల్ఎంకు మద్దతు ప్రకటించడమే కాకుండా, జట్టు కోరుకుంటే టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు ఆడే మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
మంగళవారం వెస్టిండీస్‌తో మ్యాచ్ జరగడానికి ముందు మోకాళ్లపై కూర్చుని బీఎల్ఎంకు మద్దతు తెలపాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఆటగాళ్లకు ఆదేశాలు అందాయి. అయితే, ఆ ఉద్యమానికి మద్దతు తెలపడం ఇష్టంలేని డికాక్ ఏకంగా మ్యాచ్‌కే దూరమయ్యాడు. అంతకుముందు కూడా డికాక్ ఓ మ్యాచ్‌లోనూ ఇలానే ప్రవర్తించాడు. ఉద్యమానికి మద్దతు తెలపకుండా నిలబడ్డాడు.
తాజాగా మరోమారు అతడి ప్రవర్తన వివాదాస్పదం కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు అతడి క్రికెట్ భవితవ్యం కూడా సందిగ్ధావస్థలో పడింది. దీంతో దిగొచ్చిన డికాక్.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో మాట్లాడాడు. అనంతరం విచారం వ్యక్తం చేశాడు. తన కారణంగా కలిగిన బాధకు, కోపానికి, గందరగోళ పరిస్థితులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నట్టు చెప్పాడు. ప్రపంచకప్‌లకు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంటున్నట్టే అనిపిస్తోందని, అది సరికాదని అన్నాడు. తనకు అండగా నిలిచిన జట్టు సభ్యులకు, ముఖ్యంగా కెప్టెన్ బవుమాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు.
కెప్టెన్‌తోపాటు జట్టు, దక్షిణాఫ్రికా కోరుకుంటే దేశం తరపున మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు డికాక్ పేర్కొన్నాడు. తాను మోకాలిపై కూర్చోవడం వల్ల ఇతరులకు అవగాహన కలుగుతుందని, వారి జీవితాలు మెరుగవుతాయనుకుంటే అలా చేయడం తనకు ఇష్టమేనన్నాడు. బీఎల్ఎంకు మద్దతు తెలిపే ఆదేశాలు మ్యాచ్‌కు ముందు బోర్డు నుంచి అందడంతోనే షాకయ్యానని, తన హక్కులను హరిస్తున్నట్టుగా భావించానని పేర్కొన్నాడు. నిజానికి ఆటగాళ్లతో బోర్డు ఈ విషయమై ముందే చర్చించి ఉంటే ఈ గందరగోళం ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను కూడా రెండు వర్ణాలు కలిసిన కుటుంబం నుంచే వచ్చానని, తన సవతి తల్లి నల్ల జాతీయురాలని, ఇప్పుడేదో అంతర్జాతీయ ఉద్యమం జరుగుతుందన్నది కాదు కానీ, పుట్టినప్పటి నుంచే తనకు నల్లజాతీయుల జీవితాలు ముఖ్యమైనవని వివరించాడు. తాను అందరితో ప్రేమగా ఉంటానని, తనతో కలిసిన వాళ్లకు, తనతో కలిసి ఆడినవాళ్లకు ఆ విషయం తెలుసని అన్నాడు. అయితే తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, జాత్యహంకారి అని పిలవడం తనకు చాలా బాధనిపించిందని డికాక్ వివరించాడు.