Kanakamedala Ravindra Kumar: అసభ్య పదజాల వినియోగానికి వైసీపీ నేతలు ఆద్యులు.. తొలుత ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయండి: టీడీపీ ఎంపీ కనకమేడల
- బూతులు తిట్టి, కొట్టి జైళ్లలో పెడుతూ రాష్ట్రంలో అరాచక పాలన
- విజయసాయి తొలుత తమ పార్టీ గుర్తింపును రద్దు చేయించి తర్వాత మిగతా వారి సంగతి చూడాలి
- న్యాయమూర్తులనూ బూతులు తిట్టిన విషయం మర్చిపోయారా?
తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కోరడంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంలో వైసీపీ నేతలు ఆద్యులని, తమ పార్టీ గుర్తింపును రద్దు చేయడానికి ముందు వారి పార్టీ గుర్తింపును తొలుత రద్దు చేయాలని అన్నారు.
నిన్న ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. జగన్ అధికారంలోకి రావడానికి ముందే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని గురించి అనుచితంగా మాట్లాడారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులతో అసభ్యంగా తిట్టిస్తున్నారని అన్నారు.
ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నేతను అసభ్యంగా తిడుతుంటే ఏనాడు ఆయన ఖండించలేదని అన్నారు. పైపెచ్చు చంద్రబాబును ఉగ్రవాది అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అందరినీ బూతులు తిట్టి, కొట్టి, జైళ్లలో పెట్టి రాష్ట్రంలో అరాచక పాలనకు నాంది పలికారని ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి తొలుత ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లి తమ పార్టీ గుర్తింపును రద్దు చేసుకుని, ఆ తర్వాత ఇతర పార్టీల గురించి మాట్లాడితే బెటర్ అని హితవు పలికారు. న్యాయమూర్తులపై బూతులు ప్రయోగించిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు ఢిల్లీలో ఎవరూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని విజయసాయి ప్రచారం చేస్తున్నారని, కానీ అమిత్‌షానే చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని మర్చిపోయారా? అని గుర్తు చేశారు. పార్లమెంటు కన్సల్టేటివ్ కమిటీ సమావేశం సందర్భంగా నిన్న అమిత్‌షాతో తాను మాట్లాడానని, ఈ సందర్భంగా ఆయన దృష్టికి కొన్ని విషయాలు తీసుకెళ్లినట్టు కనకమేడల తెలిపారు. మనం కలుద్దామని, ఈసారి తప్పనిసరిగా చంద్రబాబునూ పిలుస్తానని అమిత్‌షా తనతో చెప్పారని అన్నారు.