Telangana: విశాఖ టు నాగ్ పూర్ వయా హైదరాబాద్.. అరటి పండ్ల చాటున గంజాయి స్మగ్లింగ్
- ఇద్దరు నిందితులను పట్టుకున్న రాచకొండ పోలీసులు
- 110 కిలోల గంజాయి స్వాధీనం
- ‘నయా సవేరా’ పేరిట డ్రగ్స్ నివారణకు అవగాహన కార్యక్రమాలు
అరటి పండ్ల చాటున గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్థులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా నాగ్ పూర్ కు అరటిపండ్ల లోడ్ లో గంజాయిని పెట్టి తరలిస్తుండగా.. ఎల్బీనగర్ లో ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.
గంజాయి స్మగ్లింగ్ చేసేవారిపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, ఈ క్రమంలోనే చెకింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ లోని అరటి పండ్ల లోడ్ లో గంజాయిని పెట్టి తరలిస్తున్నట్టు తేలిందని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.18.5 లక్షలు ఉంటుందన్నారు. ఘటనకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.
రాష్ట్రంలో డ్రగ్స్ దందాను నివారించేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, అమృత ఫౌండేషన్ ల సహకారంతో ‘నయా సవేరా’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మహేశ్ భగవత్ తెలిపారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.