Huzurabad: ప్రారంభమైన బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్

Polling Started in Badvel and Huzurabad today at 7 am

  • సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగున్న పోలింగ్
  • బద్వేలులో భారీగా పోలింగ్‌ నమోదయ్యే అవకాశం
  • హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీ

ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ రెండు చోట్లా సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయడంతోపాటు వెబ్‌కాస్టింగ్ కూడా చేస్తున్నారు.

 2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలులో రికార్డు స్థాయిలో 77.64 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంతేస్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఆధికారులు అంచనా వేస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది.

మొత్తం 106 గ్రామపంచాయతీల్లో 306 పోలింగ్‌ స్టేషన్లలో 2,37,022 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలో చేరి టీఆర్ఎస్‌కు సవాలు విసురుతున్నారు.

తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఈటల, అభివృద్ధి పేరుతో టీఆర్‌ఎస్ విస్తృత ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాసయాదవ్ బరిలో ఉండగా, ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ (వెంకట నర్సింగరావు)ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News