Parliament: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఎఫెక్ట్.. ఎంపీలకు కేంద్రం షాక్!
- ఎంపీలకు జారీ చేసే ఉచిత విమాన టికెట్లు రద్దు
- ముందుకొనుక్కొని ఆ తర్వాత రీయింబర్స్ చేసుకోవాలని సూచన
- ఇబ్బందేనంటున్న ఎంపీలు
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైన వేళ ఎంపీలకు కేంద్రం షాకిచ్చింది. ఇకపై ఎంపీలు ఎవరి విమాన టికెట్లను వారే కొనుగోలు చేసుకుని ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ చేసుకోవాలంటూ రాజ్యసభ సచివాలయ బులిటెన్ నిన్న స్పష్టం చేసింది.
ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడంతో పార్లమెంటు సభ్యులకు వ్యక్తిగతంగా 34 టికెట్లు, వారి జీవిత భాగస్వాములకు మరో 8 టికెట్లు ఉచితంగా అందించేవారు. అయితే, ఇప్పుడు ఎయిర్ ఇండియా ‘టాటా’ల చేతికి వెళ్లిపోవడంతో ప్రైవేటీకరణ మొదలైంది.
ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ ప్రకటన విడుదల చేసింది. టికెట్ల కొనుగోలుకు పార్లమెంటు ఉభయ సభల సచివాలయాలు ఇప్పటికే జారీ చేసిన ‘ఎక్స్‌చేంజ్ ఆర్డర్’ను చూపించి టికెట్లు కొని ఉంటే కనుక టీఏ క్లెయిమ్ చేసుకోవాలని సూచించింది. అయితే, బిల్లుల క్లియరెన్స్‌కు చాలా సమయం పడుతుంది కాబట్టి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఎంపీలకు ఇబ్బంది కలిగించే అంశమేనని చెబుతున్నారు.
మరోపక్క, ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్ నిధులను తాత్కాలికంగా స్తంభింపజేసిన కేంద్రం.. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు ఉన్న 10 సీట్ల కోటాతోపాటు కేంద్రమంత్రి మంజూరు చేసే అదనపు సీట్ల కోటాను కూడా రద్దు చేయడం గమనార్హం.