GCC Honey: తిరుమల శ్రీవారి అభిషేకాలకు ఇక జీసీసీ తేనె
- గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రతిపాదన
- ఆమోదం తెలిపిన టీటీడీ బోర్డు
- టీటీడీ ల్యాబ్ లో గిరిజన తేనె పరీక్ష
- సంతృప్తి వ్యక్తం చేసిన టీటీడీ వర్గాలు
తిరుమల వెంకన్న అభిషేక ప్రియుడు. ఆయనకు జరిగే కైంకర్యాల్లో అభిషేకం కూడా ఉంటుంది. కాగా, స్వామివారి అభిషేకాల్లో ఉపయోగించేందుకు తేనెను ఏపీ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే, తేనె కొనుగోలుకు ముందుకు గిరిజన సహకార సంస్థ తేనెను టీటీడీ ల్యాబ్ లలో పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, ఎంతమొత్తంలో తేనె కావాల్సి ఉంటుందన్న దానిపై ఇంకా తమకు ఆర్డర్లు అందలేదని గిరిజన సహకార సంస్థ జనరల్ మేనేజర్ చినబాబు వెల్లడించారు. కాగా, శ్రీవారి కైంకర్యాల్లో ఉపయోగించే జీడిపప్పు, పసుపును కూడా గిరిజన సహకార సంస్థ నుంచి కొనుగోలు చేయాల్సిందిగా టీటీడీకి ప్రతిపాదించామని చినబాబు తెలిపారు.
గిరిజనుల నుంచి తేనె తదితర అటవీ ఉత్పత్తులను జీసీసీ శుద్ధి చేసి విక్రయిస్తుంది. ప్రాసెస్ చేసిన తేనె జీసీసీ విక్రయ కేంద్రాల్లో కిలో రూ.298.77 ధర పలుకుతోంది.