Puneeth Rajkumar: చిరంజీవి పక్కన చిన్న పాత్ర అయినా చాలన్నాడు: పునీత్ గురించి మెహర్ రమేశ్ వెల్లడి

Meher Ramesh remembers Puneeth Rajkumar words
  • గతంలో 'వీర కన్నడిగ' చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం
  • హీరోగా నటించిన పునీత్ రాజ్ కుమార్
  • తనను ఓ కుటుంబ సభ్యుడిలా చూసేవారన్న రమేశ్
  • భోళా శంకర్ అనౌన్స్ చేయగానే ఫోన్ చేశాడని వెల్లడి
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాలమరణం చెందడం పట్ల ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దర్శకుడు మెహర్ రమేశ్ కూడా వారిలో ఒకరు. పునీత్ తో తన స్నేహాన్ని ఆయన ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో తాను 'వీర కన్నడిగ' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చానని మెహర్ రమేశ్ తెలిపారు. ఆ సినిమాలో పునీత్ రాజ్ కుమారే హీరో అని, ఆ సినిమా భారీ హిట్టవడంతో తనపై విపరీతమైన అభిమానాన్ని చూపేవారని, ఆ తర్వాత ఆయనతో మరో చిత్రం తీశానని వెల్లడించారు.

ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో 'భోళాశంకర్' సినిమా అనౌన్స్ చేయగానే, పునీత్ రాజ్ కుమార్ తనకు ఫోన్ చేశారని మెహర్ రమేశ్ వివరించారు. ఆ సినిమాలో చిరంజీవి పక్కన నటించాలని ఉందని తన మనసులో మాటను పంచుకున్నారని, కనీసం చిన్న పాత్రయినా చేస్తానని చెప్పారని వెల్లడించారు. అది కూడా కుదరకపోతే ఓ పాటలో అయినా చిరంజీవితో డ్యాన్స్ చేసే అవకాశం కల్పించమని అడిగారని, కానీ ఆయన కల తీరకుండానే మనందరినీ వదిలి వెళ్లిపోయారని మెహర్ రమేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనను ఓ కుటుంబ సభ్యుడిలానే భావించేవారని తెలిపారు.

పునీత్ శుక్రవారం నాడు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలడం తెలిసిందే. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆయన అంత్యక్రియలు ఆదివారం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్ లో జరగనున్నాయి.
Puneeth Rajkumar
Meher Ramesh
Chiranjeevi
Tollywood
Karnataka

More Telugu News