Corona Virus: మళ్లీ బలం పుంజుకుంటున్న కరోనా..క్రమంగా పెరుగుతున్న కేసులు

Rising Corona Cases in West Bengal and Assam Center asked to do more tests
  • పశ్చిమ బెంగాల్, అస్సాంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు
  • అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
  • పరీక్షలు పెంచి కేసులు గుర్తించాలని ఆదేశం
  • కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలంటూ లేఖలు
దేశంలో కరోనా వైరస్ మళ్లీ క్రమంగా బలపడుతోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన మొదలైంది. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాంలలో వారపు పాజిటివిటీ రేటులో పెరుగుదల నమోదవుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా పరీక్షలు పెంచాలని, కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు లేఖలు రాశారు. అస్సాంలో ఈ నెల 20-26 మధ్య కేసుల సంఖ్య 41 శాతం పెరిగిందని, గత నాలుగు వారాలుగా పాజిటివిటీ రేటు 1.89 శాతం నుంచి 2.22 శాతానికి పెరిగినట్టు అస్సాంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా బాగా తగ్గినట్టు తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో గత వారం రోజుల్లో కేసుల సంఖ్య 41 శాతం పెరగడంతోపాటు 4 వారాల్లో పాజిటివిటీ రేటు 1.93 శాతం నుంచి 2.39 శాతానికి పెరిగినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని లేఖలో సూచించారు. అలాగే, కంటెయిన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసి వాటి పరిధిలో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించి కేసులను గుర్తించాలని కోరారు. మరోవైపు, దేశవ్యాప్తంగానూ కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
Corona Virus
West Bengal
Assam
Corona Tests

More Telugu News