Team India: పరాభవం నుంచి భారత్ కోలుకుంటుందా?.. టీ20 ప్రపంచకప్‌లో భారత్ నిలవాలంటే ఏం చేయాలి?

India to fight with Kiwis today is a Quatrer Final match
  • టీమిండియా-కివీస్ మధ్య నేడు కీలక పోరు
  • ఇరు జట్లకు ఇది క్వార్టర్ ఫైనల్ లాంటిదే
  • పాండ్యాతో బౌలింగ్ వేయిస్తామన్న కోహ్లీ
  • అశ్విన్, ఠాకూర్‌లలో చోటు ఎవరికి?
  • 2003 తర్వాత కివీస్‌పై ఐసీసీ ట్రోఫీల్లో నెగ్గని భారత్
  • చరిత్రను తిరగరాస్తుందా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు మరో కీలక సమరానికి సిద్దమైంది. న్యూజిలాండ్‌తో నేడు జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా  తొలిమ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో జరిగిన పరాభవం నుంచి బయటపడాలని భావిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. దీంతో నేటి మ్యాచ్‌లో గెలవడం ద్వారా విజయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నాయి. ఒకవేళ నేటి మ్యాచ్‌లో కనుక భారత్ ఓటమి పాలైతే సెమీఫైనల్ అవకాశాలు మృగ్యంగా మారుతాయి. కివీస్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. దీంతో నేటి కివీస్-భారత్ మ్యాచ్‌ను క్వార్టర్ ఫైనల్‌గా అభివర్ణిస్తున్నారు.

మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆప్ఘనిస్థాన్ కనుక నేటి మ్యాచ్‌లో నమీబియాను చిత్తుచేస్తే గ్రూప్‌ 2 పోరు ఆసక్తికరంగా మారుతుంది. ఆ జట్టు సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. ఈ గ్రూపులో ఇప్పటికే పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి జోరుమీదుంది. దీంతో నేడు జరగబోయే మ్యాచ్‌లపైనే అందరూ దృష్టిసారించారు. ఈ ప్రపంచకప్‌లో ప్రారంభం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏమంత కలిసిరాలేదు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఓడిపోవడం ద్వారా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన తొలి భారత స్కిప్పర్‌గా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు.

అయితే, పడిన ప్రతిసారి లేవడం భారత్‌కు అలవాటైన పనే కావడంతో అభిమానులు ధీమాగా ఉన్నారు. అడిలైడ్‌లో భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన టెస్టులోనూ భారత్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న భారత్ వరుస విజయాలతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. కాబట్టి ఈసారి కూడా కోహ్లీసేన పుంజుకుంటుందని అభిమానులు ఆశగా ఉన్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత టీమిండియాకు దాదాపు వారం రోజుల వ్యవధి దొరికింది. జట్టులోని లోపాలను సరిచేసుకునేందుకు ఇది చక్కని అవకాశం. అయితే, రెండు మ్యాచ్‌ల మధ్య ఇంత దూరం చేటు చేస్తుందని కూడా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టీ20లాంటి పొట్టి మ్యాచ్‌ల్లో దూరం అంతమంచిది కాదని చెబుతున్నారు.

న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడం భారత్‌కు అంత సులభమైన  పనేమీ కాదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌ను చిత్తుచేసి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లోనూ కివీస్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. 2003 తర్వాత ఐసీసీ ట్రోఫీల్లో న్యూజిలాండ్‌పై భారత్ గెలిచింది లేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఓటమికి ఆరో బౌలర్ లేకపోవడమే కారణమని భావించిన కోహ్లీ సేన నేటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ వేయాలని నిర్ణయించుకుంది. నెట్స్‌లో నిన్న పాండ్యా బంతితో చెమటోడ్చాడు. అవసరమైతే పాండ్యా బౌలింగ్ చేస్తాడని కోహ్లీ కూడా చెప్పాడు. పాండ్యా ఫిట్‌గా ఉంటే కనుక అతడితో ఒకటి రెండు ఓవర్లు వేయిస్తామని చెప్పుకొచ్చాడు.

భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి బౌలర్లు పాకిస్థాన్‌పై తేలిపోయారు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో వారు మరింతగా రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే, శార్దూల్ ఠాకూర్ ప్రాముఖ్యాన్ని కూడా కోహ్లీ గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌లో మార్పులు ఉండకపోయినా బౌలింగ్ విషయంలో మాత్రం జట్టులో కొంత మార్పు కనిపించే అవకాశం ఉంది. అయితే, జట్టులోకి వచ్చేది సీనియర్ బౌలర్ అశ్వినా లేదంటే యువ ఆటగాడు ఠాకూరా? అనే విషయంలో కొంత అస్పష్టత నెలకొంది.

నిన్న మీడియాతో మాట్లాడిన కోహ్లీ ప్రశాంతంగా కనిపించాడు. బయటి వ్యక్తుల ఆలోచనలకు అనుగుణంగా ఆడలేమని, ఆట ఎలా సాగుతుందో అలానే ఆడతామని కుండబద్ధలుగొట్టాడు. బయటి వ్యక్తుల ఆలోచనలకు జట్టులో చోటుండదని స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం షమీపై జరిగిన ఆన్‌లైన్ దాడిని ఖండించాడు.
Team India
Team New Zealand
ICC T20 World Cup
Virat Kohli

More Telugu News