Afghanistan: టీ20 వరల్డ్ కప్: నమీబియాతో పోరుకు సిద్ధమైన ఆఫ్ఘనిస్థాన్
- కొనసాగుతున్న సూపర్-12 దశ
- నమీబియాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
- పిచ్ బ్యాటింగ్ కు అనువుగా ఉందన్న కెప్టెన్ నబీ
- పక్కా ప్రణాళికతో బరిలో దిగుతున్నామన్న నమీబియా సారథి
ఆసియా జట్టు ఆఫ్ఘనిస్థాన్ టీ20 వరల్డ్ కప్ గ్రూప్-2లో తన మూడో మ్యాచ్ ఆడనుంది. నేడు అబుదాబిలో నమీబియా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ సారథి మహ్మద్ నబీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా కనిపిస్తోందని టాస్ సందర్భంగా నబీ వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా తాము మెరుగైన ప్రదర్శన కనబర్చినట్టు భావిస్తున్నామని తెలిపాడు.
మాజీ సారథి అస్ఘర్ ప్రదర్శన పట్ల తాము సంతృప్తికరంగా ఉన్నామని, గత 16 ఏళ్లుగా ఆఫ్ఘన్ క్రికెట్ రంగానికి విశేష సేవలు అందించాడని కొనియాడాడు. ఇక నమీబియాతో మ్యాచ్ కు యువ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ను పక్కనబెడుతున్నామని, అతడు అన్ ఫిట్ గా ఉండడంతో, హమీద్ హసన్ కు తుదిజట్టులో స్థానం కల్పించామని కెప్టెన్ నబీ వెల్లడించాడు.
నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ స్పందిస్తూ... మైదానంలో గాలి వీస్తోందని, అందుకు అనుగుణంగా బౌలింగ్ ప్రణాళికలు రూపొందించుకుంటామని తెలిపాడు. శ్రీలంకపై అనుసరించిన వ్యూహాన్నే ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లోనూ అమలు చేస్తామని చెప్పాడు.