Ambati Rambabu: కేంద్రంపై పోరాడే దమ్ములేదని పవన్ సాబ్ తేల్చేశాడు: అంబటి రాంబాబు
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- నిరసనలు తెలుపుతున్న కార్మికులు
- కూర్మన్నపాలెం సభకు విచ్చేసిన పవన్
- కార్మికులకు సంఘీభావం
- వైసీపీ ఎంపీలపై విమర్శలు
విశాఖ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడం కంటే, రాష్ట్ర పాలకులను బాధ్యుల్ని చేయాల్సి ఉంటుందని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ బాధ్యతను కేంద్రం నెత్తిమీద పెడితే వారికి ఇక్కడ సమస్యలు ఎలా తెలుస్తాయని అన్నారు. అందుకే దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు.
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని ఆంధ్ర ప్రభుత్వంపైనే పోరాడుదామంటూ పవన్ పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై పోరాడే దమ్ములేదని పవన్ సాబ్ తేల్చేశాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సభాముఖంగా సంఘీభావం ప్రకటించిన పవన్ కల్యాణ్... ప్రధానంగా వైసీపీ ఎంపీలపైనే ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీలు ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరంటూ నిలదీశారు. వారికి డబ్బు, కాంట్రాక్టులే ముఖ్యమని విమర్శించారు.