Shoaib Akhtar: టీమిండియాలో ఓ గ్రూపు కోహ్లీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది: షోయబ్ అక్తర్

Shoaib Akhtar opines on Team India performance in ongoing world cup
  • టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు వరుస ఓటములు
  • విమర్శలు గుప్పిస్తున్న మాజీలు
  • టీమిండియాలో లుకలుకలు ఉన్నాయన్న అక్తర్
  • కోహ్లీకి గౌరవం ఇవ్వాలని సూచన
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస ఓటముల నేపథ్యంలో మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సూపర్-12 దశ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ పైనా ఓటమిపాలైంది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు.

టీమిండియాలో పరిస్థితులు ఏమీ బాగా లేవని, జట్టు రెండుగా విడిపోయిందన్న విషయం అర్థమవుతోందని పేర్కొన్నాడు. ఒకటి కోహ్లీ గ్రూపు కాగా, మరొకటి కోహ్లీ వ్యతిరేక గ్రూపు అని వివరించాడు. తొలి రెండు మ్యాచ్ లలో కోహ్లీ కొన్ని చెత్త నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, అతనొక గొప్ప క్రికెట్ ఆటగాడని, ఆ విషయాన్ని అందరూ గౌరవించాలని సూచించాడు.

"టీమిండియాలో రెండు గ్రూపులు ఉన్నాయన్నది అత్యంత స్పష్టం. అయితే టీమ్ ఇలా ఎందుకు విడిపోయిందో నాకు తెలియదు. బహుశా కోహ్లీ కెప్టెన్ గా ఇదే తన చివరి టీ20 వరల్డ్ కప్ అని ప్రకటించిన తర్వాత ఏర్పడిన పరిణామాల వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమై ఉండొచ్చు" అని అక్తర్ వివరించాడు.

ఇక, న్యూజిలాండ్ తో మ్యాచ్ లో టీమిండియా ఆటతీరుపైనా అక్తర్ విమర్శలు చేశాడు. ఆ మ్యాచ్ లో టాస్ ఓడిపోగానే టీమిండియా ఆటగాళ్లు డీలాపడ్డారని వివరించాడు. అక్కడినుంచే వారి ఓటమి ప్రారంభమైందని అన్నాడు. మ్యాచ్ సందర్భంగా వారి దృక్పథమే బాగాలేదని అక్తర్ వ్యాఖ్యానించాడు. కాగా, సూపర్-12 దశలో టీమిండియా తన మూడో మ్యాచ్ ను ఆఫ్ఘనిస్థాన్ తో బుధవారం ఆడనుంది.
Shoaib Akhtar
Virat Kohli
Team India
T20 World Cup

More Telugu News