BJP: ప్రగతిభవన్ వద్దకు దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు... "ఆర్ఆర్ఆర్ సినిమా చూడు కేసీఆర్" అంటూ నినాదాలు
- హుజూరాబాద్ పీఠం బీజేపీ సొంతం
- ప్రగతిభవన్ వద్ద బీజేపీ కార్యకర్తల సందడి
- ఆర్ఆర్ఆర్ స్టిక్కర్ అంటించిన వాహనంలో వచ్చిన బీజేపీ కార్యకర్తలు
- వాహనంపై బండి సంజయ్, ఈటల తదితరుల ఫొటోలు
- అరెస్ట్ చేయకుండా పంపించివేసిన పోలీసులు
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘనవిజయంతో బీజేపీ శ్రేణుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. నవంబరు 2న ప్రగతి భవన్ వద్ద 'ట్రిపుల్ ఆర్ సినిమా' చూపిస్తానంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో... 'ఆర్ఆర్ఆర్' అనే స్టిక్కర్ అంటించిన వాహనంతో బీజేపీ కార్యకర్తలు ప్రగతి భవన్ వద్దకు వచ్చారు. "ఆర్ఆర్ఆర్ సినిమా చూడు కేసీఆర్" అంటూ వారు బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ వాహనంపై రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు బండి సంజయ్, రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్ ల ఫొటోలు అంటించి ఉన్నాయి.
కాగా, ప్రగతి భవన్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అరెస్ట్ చేయకుండా అక్కడ్నించి పంపించివేశారు. నినాదాలు చేసిన అనంతరం బీజేపీ కార్యకర్తలు బల్కంపేట ఎల్లమ్మ గుడిలో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లినట్టు తెలిసింది.