Team India: రెండు ఓటములతో టీమిండియాపై ఎన్ని విమర్శలో!
- టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వైఫల్యం
- పాక్, న్యూజిలాండ్ చేతిలో ఓటములు
- ప్రశ్నార్థకంగా మారిన పలు నిర్ణయాలు
- అభిమానుల్లో ఆవేదన
ఆధునిక క్రికెట్లో వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమి అంటే ముఖ్యంగా అభిమానులు ఏమాత్రం హర్షించరు. అది కూడా బరువైన అంచనాలను మోస్తుండే టీమిండియా వంటి జట్టు టీ20 వరల్డ్ కప్ వంటి వేదికపై వరుస ఓటములు చవిచూడడాన్ని సగటు అభిమానే కాదు, మాజీ క్రికెటర్లు సైతం తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. గెలిచినప్పుడు లోపాలు పెద్దగా లెక్కలోకి రావు. కానీ ఒక్క పరాజయం అనేక లోపాలను బట్టబయలు చేస్తుంది.
మొన్న న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోగానే విమర్శకుల దృష్టి ఓపెనింగ్ స్లాట్ పై పడింది. రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మకు బదులు కుర్రాడు ఇషాన్ కిషన్ ఆ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. ఆ మ్యాచ్ లో కిషన్ చేసిందేమీలేదు. దారుణంగా విఫలమయ్యాడు. టీమిండియా గెలిస్తే అతడి వైఫల్యం మరుగున పడి ఉండేదేమో కానీ, ఓటమి కారణంగా అతడి అంశం తెరపైకి వచ్చింది.
తాజాగా దీనిపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వివరణ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా పంపాలని నిర్ణయం తీసుకున్న వ్యూహకర్తల బృందంలో రోహిత్ శర్మ కూడా ఉన్నాడని రాథోడ్ వెల్లడించాడు. టాపార్డర్ లో అది కూడా ఓపెనింగ్ జోడీలో ఇద్దరూ కుడిచేతి వాటం ఆటగాళ్లు ఉండడం కంటే, ఓ ఎడమచేతి వాటం ఆటగాడు ఉంటే మంచిదన్న ఉద్దేశంతోనే ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా పంపించినట్టు వివరించాడు.
అయితే, శ్రీలంక క్రికెట్ దిగ్గజం, ముంబయి ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే టీమిండియా ఓపెనింగ్ జోడీని మార్చడం సరికాదని అన్నాడు. ఏ జట్టు బ్యాటింగ్ కూర్పు అయినా సరళంగా ఉండాల్సిందేనని, అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో మొదట వచ్చే ముగ్గురు ఆటగాళ్ల స్థానాల జోలికి మాత్రం వెళ్లరాదని స్పష్టం చేశాడు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లు టాప్-3 ఆటగాళ్లను మార్చేందుకు ఇష్టపడవని వివరించాడు.
ఇక, న్యూజిలాండ్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశానికి కోచ్ రవిశాస్త్రి కూడా హాజరైతే బాగుండేదని మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. గెలిచినప్పుడే మీడియా సమావేశాలకు వస్తారా? అంటూ విమర్శించాడు. ఓడినప్పుడు కూడా వివరణలు ఇవ్వాల్సి ఉంటుందని హితవు పలికాడు. ఎందుకు ఓడిపోయామో దేశానికి వివరించాల్సిన అవసరం ఉందని అజార్ పేర్కొన్నాడు.
కాగా, ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో అత్యధికులు... టీ20 వరల్డ్ కప్ లో భారత్ వైఫల్యాలకు కారణం ప్రధానంగా జట్టు ఎంపికేనని నిందించారు. అంతేకాదు, సీనియర్ ఆటగాళ్లు ఫామ్ లో లేకపోవడం, రెండు మ్యాచ్ లలో టాస్ కోల్పోవడం, జట్టులో కోచ్ లు, మెంటార్లతో కలిపి సలహాలు ఇచ్చేవారి సంఖ్య ఎక్కువ కావడం, ఐపీఎల్ కారణంగా అలసిపోవడం టీమిండియా దారుణ పరాజయాలకు దారితీశాయని ఆ పోల్ లో వెల్లడైంది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో పోరులో అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకోకపోవడాన్ని చాలామంది తప్పుబట్టారు.
ఏదేమైనా కోహ్లీకి కెప్టెన్ గా ఇదే చివరి టీ20 వరల్డ్ కప్. కప్ గెలిచి చిరస్మరణీయం చేసుకోవాల్సిన సమయంలో అనూహ్యరీతిలో సంక్షోభంలో చిక్కుకోవడం బాధాకరం. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నా, వాటిలో గెలిస్తే ఆటగాళ్లకు ఊరట కలుగుతుందేమో తప్ప అభిమానులకు మాత్రం కాదు. ముఖ్యంగా పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలవడాన్ని వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. న్యూజిలాండ్ పై నెగ్గి, ఇతర మ్యాచ్ ల్లోనూ గెలిచి నాకౌట్ దశలో మరోసారి పాకిస్థాన్ ను ఢీకొడతారని సగటు అభిమాని భావించాడు. కానీ, రెండు వరుస ఓటములు కథను పూర్తిగా మార్చేశాయి. బోలెడన్ని విమర్శలను మాత్రం మిగిల్చాయి.