Puthalapattu: నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ పూతలపట్టు ఎమ్మెల్యే రూ. 5.5 కోట్లు తీసుకున్నారు.. అడిగితే బెదిరిస్తున్నారు: ఐరాల జడ్పీటీసీ సుచిత్ర పేరుతో లేఖ వైరల్
- జడ్పీటీసీ వైస్ చైర్మన్, లేదంటే ఆర్టీసీ చైర్మన్, అదీ కుదరకుంటే కుప్పం వైసీపీ బాధ్యలు ఇప్పిస్తానని హామీ
- నెరవేరకపోవడంతో డబ్బులు వెనక్కి అడిగిన సుచిత్ర
- అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపు
- ప్రాణహాని ఉంది రక్షించాలంటూ సీఎంకు లేఖ
- అంతా దేవుడే చూసుకుంటాడన్న ఎమ్మెల్యే
నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ ఓ జడ్పీటీసీ సభ్యురాలి నుంచి పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రూ. 5.5 కోట్లు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన లేఖ చక్కర్లు కొడుతోంది. ఐరాల జడ్పీటీసీ సభ్యురాలు వి.సుచిత్ర సీఎం జగన్కు ఈ లేఖ రాసినట్టుగా ఉంది.
తనకు జడ్పీ వైస్ చైర్మన్ పదవిని కానీ, లేదంటే ఆర్టీసీ చైర్మన్ అదీ కుదరకుంటే వైసీపీ కుప్పం నియోజకవర్గ బాధ్యురాలిగా అవకాశం కల్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తన నుంచి రూ. 5.5 కోట్లు తీసుకున్నారని సుచిత్ర ఆ లేఖలో పేర్కొన్నట్టుగా ఉంది. అయితే, ఆయన హామీలేవీ నెరవేరకపోవడంతో తిరిగి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరానన్నారు.
బెంగళూరు వస్తే ఇస్తానని చెబితే అక్కడికి వెళ్తే బెదిరించారని, అంతేకాక, తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానన్నారని వాపోయారు. డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదని, దిక్కున్న చోట చెప్పుకోవాలని హెచ్చరించారని పేర్కొన్నారు. ఆయన నుంచి తమకు ప్రాణహాని ఉందని, కాబట్టి మీరే (జగన్) కాపాడాలని కోరినట్టుగా ఆ లేఖలో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు స్పందించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపడేసిన ఎమ్మెల్యే.. అంతా దేవుడే చూసుకుంటాడని అన్నారు.